విజయవాడలో మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన ర్యాలీ

విజయవాడ, ఆగస్టు 18: మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణాకు వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో విజయవాడలో మంగళవారం భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ చేపట్టిన ‘నశా ముక్త్ భారత్ అభియాన్’లో భాగంగా రాష్ట్ర రోడ్లు, భవనాల (ఆర్అండ్బీ) శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద ర్యాలీని ఆర్అండ్బీ ఇంజనీర్-ఇన్-చీఫ్ వి. రామచంద్ర జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రగ్స్ దుష్ప్రభావాలపై దేశవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను చైతన్యపరచాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా యువతను పట్టిపీడిస్తున్న మాదకద్రవ్యాల సమస్యను ప్రాథమిక దశలోనే అరికట్టకపోతే సమాజానికి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలను తెలుసుకోవడంతో పాటు తమ పరిధిలోని వారిని కూడా చైతన్యపరచాలని ఆయన సూచించారు. మత్తు పదార్థాల వినియోగం, అక్రమ రవాణా నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆర్అండ్బీ చీఫ్ ఇంజనీర్ కె. నవీన్ మాట్లాడుతూ డ్రగ్స్ నిర్మూలనకు సమాజంలోని అన్ని వర్గాలు సమష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని కోరారు.
ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి ప్రారంభమైన ర్యాలీ బెంజ్ సర్కిల్ మీదుగా ఆర్అండ్బీ శాఖ హెచ్ఓడీ భవనం వరకు కొనసాగింది. కార్యక్రమంలో సూపరింటెండెంట్ ఇంజనీర్ జి.వి. భాస్కరరావు, ఈఈ రవిశంకర్, డీఈఈ వై. శశిభూషణ్తో పాటు శాఖకు చెందిన 100 మందికి పైగా అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ మాదకద్రవ్యాల వ్యతిరేక సందేశాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు.




